: పంజాబ్ లో దక్షిణ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ పర్యటన
భారత సంతతికి చెందిన అమెరికాలోని దక్షిణ కరోలినా గవర్నర్ నిక్కి హేలీ పంజాబ్ లో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రానికి హేలీ చండీఘర్ చేరుకుంటారు. రేపు అమృత్ సర్ వస్తారని ఆ జిల్లా అధికారులు తెలిపారు. "ఈ నెల 15న ఆమె గోల్డెన్ టెంపుల్, జలియన్ వాలాబాగ్ ప్రాంతాన్ని సందర్శిస్తారు. అంతేగాక గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయానికి వెళ్లి, అక్కడి విద్యార్థులను కలుస్తారు. ఇక్కడ తన బంధువులను కూడా కలవనున్నారు" అని అమృత్ సర్ జిల్లా ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. అమెరికా వెళ్లేంతవరకు హేలి తల్లిదండ్రుల కుటుంబం వెర్కా సబర్బ్ లోనే నివసించింది. ఈ క్రమంలో సిక్కు పవిత్ర ఆలయం హర్మందిర్ సాహిబ్ (గోల్డెన్ టెంపుల్) ను దర్శించుకుని, ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఇటీవలే దక్షిణ కరొలినా గవర్నర్ గా తిరిగి ఎన్నికయిన హేలీ, నాలుగు దశాబ్దాల్లో తన కుటుంబ సొంత రాష్ట్రంకు రావడం ఇదే తొలిసారి.