: అంబానీ పైలెట్ల మతి మరుపు... పరుగులు పెట్టిన ముంబై ఎయిర్ పోర్ట్ అధికారులు
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సొంత విమానం నుంచి 'మే డే' సిగ్నల్స్ (ఆపదలో వున్నప్పుడు ఇచ్చే సంకేతాలు) ముంబై ఏటీసీ టవర్ కు వస్తున్నాయి. ఒకసారి కాదు... పదేపదే వస్తున్నాయి. ఒక్కసారిగా ముంబై ఎయిర్ పోర్ట్ లో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ఏటీసీ ఉద్యోగుల్లో భయాందోళనలు పెరిగాయి. అంబానీకి చెందిన సూపర్ లగ్జరీ విమానం ఎయిర్ బస్ ఎ-319 నుండి "ఢిల్లీ - లాహోర్ - మస్కట్ - మేము మునిగిపోతున్నాం. ఇంజన్లో మంటలు అంటుకున్నాయి. విమానం పడిపోతోంది" ఇది ఆ విమానం నుంచి వచ్చిన సిగ్నల్స్ సారాంశం. తొలుత 8:30 గంటల సమయంలోను, ఆపై మరో ఆరు నిమిషాల తరువాత ఇంకోసారి మేడే సిగ్నల్స్ వచ్చాయి. ఆందోళనలో ఉన్న విమానాశ్రయ సిబ్బంది కరాచీ, మస్కట్ ఎయిర్ పోర్ట్ అధికారులతో మాట్లాడగా తమకు ఆ విమానం నుంచి ఎలాంటి మేడే సంకేతాలు రాలేదని తెలిపారు. ఎంతో అత్యవసర సమయంలో మాత్రమే వాడే 121.5 హెర్ట్జ్ పై సిగ్నల్స్ వచ్చాయి. ఏటీసీ అధికారులు సిగ్నల్ డిటెక్షన్ వ్యవస్థను ఉపయోగించగా ఆ సిగ్నల్స్ నెల నుంచే వస్తున్నట్టు తెలిసింది. ఇంతకీ అసలు విషయం ఏమంటే... మంగళవారం నాడు అంబానీ విమానంలో డీజీఏసీ ఆధ్వర్యంలో అత్యవసర సమయంలో పనితీరుపై పరీక్ష జరిగింది. దాని తరువాత పైలెట్లు మేడే సంకేతాలు పంపే బటన్ ను ఆపటం మరిచారు. తిరిగి బుధవారం విమానం ఎక్కి పవర్ ఆన్ చేయగానే ఆ సంకేతాలు వెళ్ళాయి. జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నట్టు ముంబై విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ విమానాన్ని 2007లో తన సతీమణి నీతా అంబానికి ముఖేష్ బహుమతిగా ఇచ్చాడు. దీని ఖరీదు 250 కోట్ల రూపాయలు.