: తెలంగాణ జూడాలపై వేటేనా?


గ్రామీణ సేవలపై జూనియర్ డాక్టర్లు మొండిపట్టుదలతో 45 రోజులుగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో వారిపై వేటు వేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఇప్పటికే 45 రోజుల పాటు సమ్మె చేస్తున్న జూడాలు మార్చి-ఏప్రిల్ మధ్య జరగనున్న పరీక్షలకు అర్హత కోల్పోయారు. పరీక్షలకు హాజరయ్యేందుకు కావాల్సిన హాజరు శాతం లేకపోవడమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి నివేదించనున్నట్లు తెలంగాణ వైద్య విద్య సంచాలకులు శ్రీనివాస్ చెబుతున్నారు. వర్సిటీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్న పక్షంలో సమ్మెలో పాల్గొంటున్న 2 వేల మంది పీజీ, 1,500 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఒక సంవత్సరాన్ని కోల్పోతారు. డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తూ ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన జూడాలు పరీక్షల కోసం థీసిస్ (డెసర్టేషన్)ను మాత్రం సమర్పించారు. అయితే గైర్హాజరైన విద్యార్థుల డెసర్టేషన్ లను ఎలా స్వీకరిస్తామన్న భావనతో వాటిని తిరస్కరించక తప్పని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పరిస్థితిని వివరిస్తూ మూడు వేల మంది విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు రాసినా ఫలితం లేకపోయిందని శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం నాడైనా జూడాలు సమ్మె విరమిస్తే, ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించే విషయంలో పున:పరిశీలన చేస్తుందని, లేని పక్షంలో జూడాలు మూల్యం చెల్లించక తప్పదని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. అయితే డిమాండ్లు పరిష్కారమయ్యే దాకా సమ్మె విరమించేది లేదని జూడాలు చెబుతున్నారు. దీనిపై విచారణ చేస్తున్న హైకోర్టు తీర్పును గౌరవిస్తామని వారు వెల్లడిస్తున్నారు.

  • Loading...

More Telugu News