: కాశ్మీర్లో ముస్లిమే సీఎం కావాలి... బీజేపీకి ఓటేస్తే హిందూ వ్యక్తి వస్తాడు: పీడీపీ
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాశ్మీర్ ఓటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ సభ్యులకు ఓట్లు వేయరాదని పీడీపీ నేత పీర్ మన్సూర్ పిలుపునిచ్చారు. ముస్లిం మైనారిటీలు అత్యధికంగా ఉన్న కాశ్మీర్ లో ముఖ్యమంత్రిగా ముస్లిం వ్యక్తి మాత్రమే ఉండాలని, బీజేపీకి ఓటేస్తే కచ్చితంగా హిందూ వ్యక్తి సీఎం అవుతాడని వ్యాఖ్యానించారు. అదే జరిగితే కాశ్మీర్ ప్రజలకు ఎంతో అన్యాయం జరుగుతుందని అన్నారు. మన్సూర్ వివాదాస్పద వ్యాఖ్యల పట్ల బీజేపీ వెంటనే స్పందించింది. తక్షణం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ వ్యాఖ్యలు మత రాజకీయాలను పెంచుతున్నాయని, దేశ సమగ్రతకు చేటని బీజేపీ తెలిపింది. కాగా కాశ్మీర్ లో ఉన్న 87 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 25 నుంచి 5 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.