: ఆంధ్రాబాబుల రిమోట్ తో తెలంగాణ అసెంబ్లీలో బొమ్మలాట: ఆర్మూర్ ఎమ్మెల్యే
ఆంధ్రాబాబుల చేతిలోని రిమోట్ కంట్రోల్ తో తెలంగాణ శాసనసభలో బొమ్మలు ఆడుతున్నాయని బుధవారం టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ సభ్యులపై విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రిమోట్ కంట్రోల్ తో తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావులతో బొమ్మలాట ఆడిస్తున్నారన్నారు. మాయల పకీరు ప్రాణం చిలుకలో ఉన్న చందంగా...రేవంత్ రెడ్డి, దయాకరరావుల ప్రాణాలు చంద్రబాబు గుప్పిట్లో ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన రేవంత్, ఎర్రబెల్లిలు బాబు డైరెక్షన్ లో తెలంగాణ సర్కారుపై ఎగురుతున్నారన్నారు. ఆంధ్రా పెత్తనాన్ని ఇకపై ఎంతమాత్రం సహించబోమని ఆయన హెచ్చరించారు.