: ఏపీకి ప్యాకేజీపై నేడు కేంద్రం సమీక్ష...సమావేశానికి ఏపీ కేంద్ర మంత్రులు
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రకటించాల్సిన ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి నేడు కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించనుంది. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు అశోక గజపతి రాజు, సుజనా చౌదరీలు హాజరుకానున్నారు. ఆర్థిక, వాణిజ్య, రెవెన్యూ శాఖల కార్యదర్శులు కూడా హాజరుకానున్నారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణకు పన్నుల ప్రోత్సాహంతో పాటు రూ.24,350 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ఏపీ సీఎం కేంద్రం నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో జరిపిన భేటీలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే నేడు ఈ భేటీ జరుగుతోంది. ఇదిలా ఉంటే 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థికలోటు రూ.24,811 కోట్లను ప్రత్యేక గ్రాంటుగా అందించాలని రాష్ట్రం, కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న విషయంపైనా నేటి భేటీలో చర్చ జరగనుంది. అంతేకాక, కీలక నిర్ణయాలు కూడా నేడు వెలువడే అవకాశాలున్నాయి.