: విరిగిన చక్రంతో... 110 కిలో మీటర్ల వేగంతో... శతాబ్ధి ఎక్స్ ప్రెస్ పరుగులు!
శతాబ్ధి ఎక్స్ ప్రెస్... భారతీయ రైల్వేలో అత్యధిక వేగంగా ప్రయాణించే రైలు. అంతేకాక భారతీయ రైల్వేల ప్రతిష్ఠాత్మక రైలు కూడా. ఈ రైలు సోమవారం ఓ భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఆ సమయంలో రైలులో 300 మంది ప్రయాణికులున్నారు. వీరిలో కొందరు విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు. అసలు విషయమేంటంటే, సోమవారం ఉదయం న్యూఢిల్లీ నుంచి అజ్మీర్ కు శతాబ్ధి ఎక్స్ ప్రెస్ ప్రయాణం ప్రారంభించింది. జైపూర్ కు 40 కిలోమీటర్ల దూరంలోని బోబాస్ స్టేషన్ వద్దకు చేరుకునే ముందు, అందులో ఏదో లోపమున్నట్లు గేట్ మన్ కలూరాం గుర్తించాడు. వెంటనే సమాచారాన్ని స్టేషన్ మాస్టర్ రామావతార్ కు చేరవేశాడు. అప్పటికే ఆ రైలు బోబాస్ స్టేషన్ ను దాటేసింది. వెంటనే రామావతార్ సూపరింటెండెంట్ కలురాం మీనాను అప్రమత్తం చేశారు. తర్వాతి స్టేషన్ అసాల్పూర్- జోబ్నర్ వద్ద రైలును నిలిపేశారు. తీరా పరిశీలిస్తే, రైలులోని ఓ చక్రం సగం మేర విరిగిపోయింది. మరికొంత దూరం ప్రయాణించి ఉంటే ఘోర ప్రమాదం తప్పకపోయేదని ఇంజినీర్లు చెప్పారు. రైలు బయలుదేరేముందు న్యూఢిల్లీలో సిబ్బంది, పూర్తి స్థాయిలో జరిపిన పరిశీలనలో ఈ లోపం వెలుగుచూడకపోవడం గమనార్హం. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశామని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని నార్త్ వెస్టర్న్ రైల్వే తెలిపింది.