: హైదరాబాదులోనూ ఎర్రచందనం అక్రమ రవాణా
శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం అక్రమ రవాణాపై ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ తరహా అక్రమ రవాణా హైదరాబాదుకూ విస్తరించింది. బుధవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని చిన్న గోల్కొండ వద్ద ఓ లారీ ముందుగా వెళుతున్న టెంపోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయాడు. ప్రమాదం నేపథ్యంలో లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో అక్రమంగా రవాణా అవుతున్న ఎర్రచందనం దుంగలను కనుగొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.