: కీచక వైద్యుడి చెంప వాచిపోయింది!
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో డాక్టర్ అర్పిత్ చోప్రా హోమియోపతి క్లినిక్ నిర్వహిస్తున్నాడు. అక్టోబర్ 28న ఎప్పట్లానే పేషెంట్లను చూస్తున్న చోప్రాకు ఊహించని పరిణామం ఎదురైంది. వసుంధర శర్మ అనే మహిళ నేరుగా చోప్రా గదిలోకి వెళ్లి ఆయనకు చెంపదెబ్బల ట్రీట్ మెంట్ ఇచ్చింది! 30 నిమిషాల వ్యవధిలో చోప్రా చెంపలు వాచిపోయేలా 70 చెంపదెబ్బలు కొట్టింది. పోలీసులు వచ్చినా ఆమె ఆగ్రహం చల్లారలేదు. వారి ఎదురుగానే అతడి చొక్కా చించేసింది. అంతకుముందే లైంగిక వేధింపుల కేసు దాఖలు చేసింది. కాగా, తనపై దాడి విషయమై, డాక్టర్ చోప్రా నవంబర్ 7న టుకోగంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 2012లో ఆమె తన వద్ద హోమియోపతిలో మూడు నెలల శిక్షణ కోసం వచ్చిందని, తనతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో, తానామెను క్లినిక్ నుంచి వెళ్లిపోవాలని కోరానని తెలిపాడు. అప్పటి నుంచి ఫోన్ లో బెదిరించేదని ఆరోపించాడు. దీనిపై తాను టుకోగంజ్ పోలీస్ స్టేషన్లోనూ, మహిళా కమిషన్ లోనూ ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. అయితే, వసుంధర శర్మ తండ్రి వాదన మరోలా ఉంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి, డాక్టర్ చోప్రా తన కుమార్తెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని అంటున్నారు. దీంతో, పోలీసులు వీరి కేసుల విషయంలో దర్యాప్తు మొదలుపెట్టారు.