: కేంద్రం నుంచి రూ. 36 వేల కోట్లు ఎలా వస్తాయో చెప్పండి: బీజేపీ ఫ్లోర్ లీడర్ లక్ష్మణ్
తెలంగాణ బడ్జెట్ లో అంకెల గారడీ తప్ప మరేం లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రం లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిందన్న పోటీతోనే ఇక్కడ బడ్జెట్ ను కూడా లక్ష కోట్లు దాటించారని ఆరోపించారు. బడ్జెట్లో పేర్కొన్న నిధులను ఎక్కడి నుంచి తీసుకొస్తారని సూటిగా ప్రశ్నించారు. రూ. 82,200 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో తెలిపారని... రూ. 36 వేల కోట్లు కేంద్రం నుంచి వస్తాయని చెప్పారని... కేంద్రం నుంచి నిధులు ఎలా వస్తాయో సభకు వివరించాలని డిమాండ్ చేశారు. ప్రతిష్ఠకు పోయి లక్ష కోట్ల బడ్జెట్ ను తయారు చేశారని విమర్శించారు. బడ్జెట్ రూపొందించడం కోసం అసెంబ్లీ సమావేశాలను కూడా వాయిదా వేశారని... తీరా చూస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బడ్జెట్ ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరితో లెక్కలేనన్ని ఇంజినీరింగ్ కాలేజీలు మూతపడ్డాయని... ఫీజు రీయింబర్స్ మెంట్ లేక విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని లక్ష్మణ్ మండిపడ్డారు. ఉద్యోగాలకోసం, ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విద్యార్థులను పరామర్శించాల్సి రావడం బాధాకరమని అన్నారు.