: ఏపీ ప్రభుత్వంపై నిందలు మోపడం సరికాదు: మంత్రి యనమల
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కారణమంటూ పదేపదే చేస్తున్న ఆరోపణలను ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. అసెంబ్లీ వేదికగా చేసుకొని ఏపీ సర్కారుపై తప్పులు మోపుతున్నారని, ఇది ఏ మాత్రం సరికాదని మీడియా సమావేశంలో చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవాలు దాచి ప్రజలు, శాసనసభను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. జూరాల వంటి ప్రాజెక్టుల నుంచి ఏపీకు వాటా ఇవ్వడం లేదని, తమకంటే ఎక్కువ యూనిట్ల విద్యుత్ ను తెలంగాణనే వాడుకుంటోందని యనమల వివరించారు. కొన్ని ప్రాజెక్టుల్లో ఏపీ నుంచి అధిక వాటా వాడుకుని ఇలా అభాండాలు వేస్తారా? అని ప్రశ్నించారు. వివాదాలు సృష్టించి లబ్ధి పొందాలని టీఆర్ఎస్ చూస్తోందని, ఇలాంటి ఆలోచనను మానుకోవాలని మంత్రి సూచించారు. సీఎం చంద్రబాబు ఇరు రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పిన మంత్రి, రెండు ప్రభుత్వాలు కూర్చొని సమస్యలను పరిష్కరించుకోవాలన్న విషయాన్ని పునరుద్ఘాటించారు.