: అధ్యయనం చేసి బడ్జెట్ తయారు చేసినట్టు లేదు... సరైన లెక్కలు లేవు: జానారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. సరైన అధ్యయనం చేయకుండానే బడ్జెట్ తయారు చేసినట్టుందని... సరైన లెక్కలు లేవని మండిపడ్డారు. బడ్జెట్లో పొందుపరిచిన వివరాలన్నీ గందరగోళంగా ఉన్నాయని ఆరోపించారు. పక్క రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లు దాటిందనే ఆలోచనతో... మీరు కూడా లక్ష కోట్లు దాటించారా? అంటూ ప్రశ్నించారు. అద్భుతాలు సృష్టిస్తామని ప్రభుత్వం పదేపదే చెప్పుకోవడం సరికాదని... ఏదైనా చేతల్లో చూపిస్తేనే బాగుంటుందని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ పాలనను తప్పుబడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి వృద్ధి రేటుపై స్పష్టత లేదని జానారెడ్డి ఎద్దేవా చేశారు. 2004-14 మధ్యకాలంలో గణనీయమైన వృద్ధిని సాధించామని... గుజరాత్ కంటే ఎక్కువ అభివృద్ధిని నమోదు చేశామని చెప్పారు. తమ పాలనలో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం కూడా పెరిగిందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ సమర్థత వల్లే తెలంగాణ రాష్ట్రానికి మిగులు బడ్జెట్ వచ్చిందని ముఖ్యమంత్రిని ఉద్దేశించి జానారెడ్డి అన్నారు.