: వికటించిన కు.ని. ఆపరేషన్లు... ఛత్తీస్ గఢ్ లో 11 మంది మహిళల మృతి

ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బిలాస్ పూర్ లో జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పదకొండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి అమర్ అగర్వాల్ సొంత జిల్లా అయిన బిలాస్ పూర్ లో నిర్వహించిన ఓ హెల్త్ క్యాంపులో డాక్టర్లు చేసిన శస్త్ర చికిత్సలు విఫలమయ్యాయి. శనివారం నాడు కు.ని. ఆపరేషన్ లు జరుగగా సోమవారం నాడు అందరు మహిళలూ తమకు కడుపులో నొప్పిగా ఉందని, జ్వరంతో బాధపడుతున్నామని వివిధ ఆసుపత్రుల్లో చేరారు. వారిలో పదకొండు మంది మరణించారు. నేమి చంద్ ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆరోగ్య శిబిరంలో మొత్తం 80 మంది మహిళలకు కేవలం 5 గంటల వ్యవధిలో శస్త్ర చికిత్సలు జరిగినట్టు తెలుస్తోంది. తమకిచ్చిన టార్గెట్లను అందుకునే తొందర్లో ఒకేసారి ఇంతమందికి ఆపరేషన్లు చేయడం వల్లే ఈ అనర్థం జరిగిందని విపక్షాలు విమర్శించాయి. కాగా మృతి చెందిన వారికి 2 లక్షల రూపాయలను, ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నవారికి 50 వేల రూపాయలను పరిహారంగా ఇస్తున్నట్టు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ప్రకటించింది.

More Telugu News