: ఈ ప్రభుత్వాన్ని నడిరోడ్డు మీద నిలబెట్టి రాళ్లతో కొట్టించాలి: రేవంత్ రెడ్డి


శాసనసభలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. సమగ్రసర్వేనే అన్ని పథకాలకు ఆధారమంటూ తెలంగాణ ప్రభుత్వం ఊదరగొట్టిందని... దీంతో భయపడిపోయిన ప్రజలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు సైతం ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ సమగ్ర సర్వే కోసం తమ గ్రామాలకు తరలి వచ్చారని గుర్తు చేశారు. సమగ్ర సర్వే పేరిట రాష్ట్రాన్ని 12 గంటల పాటు నిర్బంధించారని అన్నారు. సర్వే రోజు బస్సులు బంద్ చేసి, వైన్ షాపులను ఓపెన్ చేయించారని ఎద్దేవా చేశారు. సర్వేలో ప్రభుత్వ తప్పిదాలు చాలా ఉన్నాయని అన్నారు. సర్వేకి ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, అందరి సలహాలు తీసుకుంటే బాగుండేదని చెప్పారు. సర్వేనే అన్నింటికీ ఆధారం అన్నవారు... ఇప్పుడు పింఛనులు తదితర పథకాలకు మళ్లీ రకరకాల పత్రాలు తీసుకురావాలంటూ ఎందుకు వేధిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. వితంతు పింఛన్ కోసం వెళ్తే, భర్త చనిపోయినట్టు ధృవీకరణ పత్రం తీసుకురావాలంటున్నారని... ఇదెక్కడ న్యాయం? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేసిన సర్వే తప్పుల తడక అని మీరు భావిస్తే, ఆధార్ కార్డులను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టి రాళ్లతో కొట్టించాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News