: ఏపీ రాజధాని ప్రపంచ స్థాయిలో ఉంటుంది: దేవినేని ఉమ


అనంతపూర్, కర్నూలు, కడప, కర్ణాటకలోని బళ్లారి ప్రాంతాలలో ప్రవహించే తుంగభద్ర లోలెవల్, హైలెవెల్ కెనాళ్ల ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమ చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాలుగా తుంగభద్ర మేనేజ్ మెంట్ బోర్డు ఎలాంటి ఆధునికీకరణ పనులు చేపట్టలేదని తెలిపారు. ఈ విషయంపైనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలసి కాల్వల ఆధునికీకరణ పనులు చేపట్టాలని కోరామని వెల్లడించారు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాలు కలసి పనిచేద్దామని కోరామని చెప్పారు. దీనికి సిద్ధరామయ్య తన సంసిద్ధతను వ్యక్తం చేశారని ఉమ తెలిపారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వివరాలను వెల్లడించారు. నీటి విషయంలో ఏపీ ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తోందని అన్నారు. జన్మభూమి కార్యక్రమంలో గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి సంబంధించి అనేక సలహాలు, సూచనలు అందాయని చెప్పారు. విజయవాడలో రాజధాని కడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదని... విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాజధాని నిర్మిస్తామని మాత్రమే చెప్పారని ఉమ స్పష్టం చేశారు. గుంటూరు, విజయవాడ సిటీల మధ్యన కృష్ణానది ఒడ్డున రాజధాని నిర్మాణం చేపడుతున్నామని... ఇది ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా తయారవుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి సింగపూర్ వెళ్లి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం విషయంలో రైతుల వద్దకు వెళ్లి, వారి అపోహలను తొలగిస్తామని వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి అనేక సూచనలు అందుతున్నాయని... వాటన్నింటినీ క్రోడీకరించి తుది రూపునిస్తామని తెలిపారు. రాజధానికోసం భూములిచ్చేందుకు రైతులు కూడా ముందుకు వస్తున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News