: ప్రకాశం జడ్పీ చైర్మన్ గా మళ్లీ ఈదర హరిబాబు!
ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ గా మళ్లీ ఈదర హరిబాబు బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ దఫా అధికారుల అనుమతి లేకుండానే ఆయన నేరుగా జడ్పీ చైర్మన్ చాంబర్ కు వెళ్లి చైర్మన్ సీట్లో ఆసీనులయ్యారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న టీడీపీ ఫిర్యాదు నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఈదరను జడ్పీ చైర్మన్ పదవి నుంచి తొలగించారు. అయితే కోర్టులో న్యాయ పోరాటం సాగించిన ఈదర హైకోర్టు ఉత్తర్వులతో తిరిగి తన సభ్యత్వాన్ని నిలుపుకున్నారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఒంగోలు వెళ్లిన ఈదర నేరుగా జడ్పీ చాంబర్ కు వెళ్లి విలేకరుల సమావేశం నిర్వహించారు. జడ్పీ చైర్మన్ ను తానేనని, హైకోర్టు జడ్పీటీసీగా తనను అర్హుడిగానే ప్రకటించిన నేపథ్యంలో జడ్పీ చైర్మన్ గానూ తనకు అర్హత ఉందని ఈదర హరిబాబు వెల్లడించారు.