: నేడు విదేశీ పర్యటనకు చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. తన కేబినెట్ లోని మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావులతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులతో కలసి సింగపూర్ వెళ్లనున్న చంద్రబాబు మూడు రోజులపాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించేందుకు ఆయన అక్కడి పారిశ్రామిక వేత్తలతో పాటు సింగపూర్ ప్రభుత్వ పెద్దలతోనూ విడతలవారీగా చర్చలు జరపనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వెళుతున్న ఆయన వెంట 15 మందితో కూడిన సీఐఐ ప్రతినిధి బృందం కూడా వెళ్లనుంది. సింగపూర్ లో జరిగే దక్షిణాసియా సదస్సులో పాల్గొనే ఆయన కీలకోపన్యాసం చేయనున్నారు. పర్యటనలో భాగంగా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సింగపూర్ పరిణామ క్రమాన్ని కూడా చంద్రబాబు పరిశీలించనున్నారు. కొత్తగా నిర్మించనున్న నవ్యాంధ్ర రాజధానిని కూడా సింగపూర్ తరహాలో రూపుదిద్దుతానంటూ ఆయన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆ దిశగానే చంద్రబాబు తన పర్యటనలో భాగంగా సింగపూర్ నిర్మాణ క్రమాన్ని పరిశీలించడంతో పాటు ఆ తరహాలో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి సింగపూర్ నిపుణుల సలహాలను కూడా కోరనున్నారని సమాచారం.