: ఫామ్ లో ఉన్న ధావన్ కు విశ్రాంతి... జట్టులోకి రోహిత్
శ్రీలంకతో చివరి రెండు వన్డేలకు టీమిండియాను ప్రకటించారు. ఫామ్ లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్ కు విశ్రాంతినిచ్చారు. అతని స్థానంలో డాషింగ్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మకు చోటిచ్చారు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు, ధోనీ గైర్హాజరీలో పెద్దగా ఆకట్టుకోని వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను జట్టు నుంచి తప్పించారు. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఈ నెల 13న నాలుగో వన్డే (కోల్ కతా), 16న ఐదో వన్డే (రాంచీ) జరగనున్నాయి. తొలి మూడు వన్డేల్లో జయభేరి మోగించిన టీమిండియా 3-0తో సిరీస్ కైవసం చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రిజర్వ్ బెంచ్ కు అవకాశాలివ్వాలని టీమిండియా వ్యూహకర్తలు భావిస్తున్నారు. చివరి రెండు వన్డేలకు జట్టు ఇదే... విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, సురేశ్ రైనా, రాబిన్ ఊతప్ప, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, స్టూవర్ట్ బిన్నీ, వినయ్ కుమార్, ధవళ్ కులకర్ణి, అక్షర్ పటేల్, కర్ణ్ శర్మ, కేదార్ జాదవ్.