: ప్రియాంకా గాంధీనే కాంగ్రెస్ కి పునరుజ్జీవాన్ని తేగలరు: హెచ్ఆర్ భరద్వాజ్
రోజు రోజుకీ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న విభేదాలే... లోక్ సభ ఎన్నికలు, హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో పార్టీ ఘోరంగా ఓడిపోయేందుకు కారణమయ్యాయన్న సంగతి స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో, పలువురు హస్తం సీనియర్ నేతలు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో, పార్టీలో పునరుత్తేజం, చైతన్యం తీసుకురాగలిగిన సామర్థ్యం ఒక్క ప్రియాంకా గాంధీకే ఉన్నాయని మాజీ గవర్నర్ హెచ్ ఆర్ భరద్వాజ్ తాజాగా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఓ ఆంగ్ల ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రియాంకకు పార్టీలో మరింత క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాన్ని ఇచ్చేందుకు అధినేత్రి సోనియా గాంధీకి ఇదే మంచి సమయమన్నారు. కాగా, 2జీ లైసెన్సులను అప్పుడే రద్దు చేయాలని తాను డిమాండ్ చేసినా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వినలేదన్న మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరాన్ని భరద్వాజ్ విమర్శించారు. "లైసెన్సులను రద్దు చేయమని చిదంబరం అసలెప్పుడూ అడగలేదు. ఆయన వినలేదని చెప్పడం చాలా తప్పు" అని పేర్కొన్నారు.