: టీఎస్ అసెంబ్లీలో ఆంధ్ర గొంతు వినిపిస్తున్నారు: హరీష్ రావు


పక్క రాష్ట్ర నాయకుడి అజెండాను టీటీడీపీ నేతలు అమలు చేస్తున్నారని టీఎస్ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా టీడీపీ సభ్యుల వ్యవహారశైలి ఉందని మండిపడ్డారు. రాష్ట్ర పునర్నిర్మాణంలోనైనా టీడీపీ సభ్యులు కలసి వస్తారని భావించామని... రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పటికీ, తెలంగాణలోని అన్ని పార్టీలు ఒకటి కాలేకపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో విద్యుత్ అంశంపై చర్చ జరుగుతున్న సందర్భంలో, రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా మధ్యలో కల్పించుకున్న హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఆంధ్ర ప్రాంత గొంతు వినిపించడం దారుణమని హరీష్ అన్నారు. ఇండియా-పాకిస్థాన్ ల మధ్య యుద్ధం జరిగితే దేశమంతా ఒకటవుతుందని... కావేరి జలాల కోసం తమిళనాడులోని పార్టీలు, సినీ నటులు, ప్రజలు అంతా ఒక్కటయ్యారని... తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో ఒక్కటి కాలేకపోతున్నామని అన్నారు. ఏపీ ప్రభుత్వ విధానాలను టీడీపీ నేతలు అనుసరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ పంటలను ఎండగొడుతున్న చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు వత్తాసు పలుకుతుండటం శోచనీయమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News