: భారత రక్షణ శాఖ మంత్రిగా మనోహర్ పారికర్!
భారత రక్షణ శాఖ బాధ్యతలను గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చేపట్టనున్నారు. ఆదివారం కేంద్ర మంత్రిగా పదవీ ప్రమాణం చేసిన పారికర్ కు ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటిదాకా ఈ శాఖను ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అదనపు బాధ్యతలుగా పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో అటు పాకిస్థాన్ నుంచే కాక ఇటు చైనా నుంచి కూడా చొరబాట్లు పెరిగిన నేపథ్యంలో రక్షణ శాఖ మరింత కీలకంగా మారింది. అంతేకాక గతంలో ఎన్నడూ లేనంతగా సైనిక సంపత్తిని సమకూర్చుకునేందుకు భారీ నిధులను మోదీ సర్కారు కేటాయించింది. ఈ నేపథ్యంలో సమర్ధుడైన మంత్రి లేకపోతే ఇబ్బందేనన్న భావనతో మోదీ, గోవా సీఎంగా పనిచేస్తున్న పారికర్ వైపు దృష్టి సారించారు. పారికర్ చేత సీఎం పదవికి రాజీనామా చేయించి మరీ కేంద్ర కేబినెట్ లోకి తెచ్చుకున్నారు. హామీ ఇచ్చిన మేరకు పారికర్ కు రక్షణ శాఖ బాధ్యతలను అప్పగించారు. ఒకటి రెండు రోజుల్లో పారికర్ రక్షణ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.