: మోదీ తీరుపై శివసేన ఆగ్రహం...ప్రమాణం చేయకుండానే వెనుదిరిగిన అనిల్ దేశాయ్
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన షాక్ కు శివసేన కూడా అంతేవేగంగా స్పందించింది. తమ ఆమోదం లేకుండా తమ పార్టీ ఎంపీల ప్రాధాన్యాన్ని మీరెలా మారుస్తారన్న భావనతో కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయమని పంపిన తన ఎంపీని వెనక్కు రప్పించింది. దీంతో మోదీ సర్కారులో మంత్రిగా ప్రమాణం చేసేందుకు డిల్లీ వెళ్లిన శివసేన ఎంపీ అనిల్ దేశాయ్, పదవి చేపట్టకుండానే వెనుదిరిగారు. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఆదేశాల మేరకే అనిల్ వెనుదిరిగారు. అసలు విషయమేంటంటే, కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా ఇద్దరు శివసేన ఎంపీలకు మంత్రిపదవులిస్తామని బీజేపీ ప్రతిపాదించింది. దీంతో అనిల్ దేశాయ్ కి కేబినెట్ హోదా, సురేశ్ ప్రభుకు సహాయ మంత్రి పదవులివ్వాలని ఉద్ధవ్ ఠాక్రే, మోదీకి సూచించారు. అయితే సురేశ్ ప్రభుకు కేబినెట్ హోదా, అనిల్ కు సహాయ మంత్రి పదవి ఇస్తున్నారన్న సమాచారంతో ఉద్ధవ్ ఆగ్రహానికి గురయ్యారు. వెనువెంటనే అనిల్ కు ఫోన్ చేసిన ఉద్ధవ్, తిరిగొచ్చేయమని ఆదేశాలు జారీ చేశారు. మోదీ తీరుపై ఉద్ధవ్ సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. మోదీతో పాటు బీజేపీ వ్యవహారంపై ఉద్ధవ్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం.