: చేసేది స్మగ్లింగ్.. అందులో దేవుడికి వాటా!
మధ్యప్రదేశ్ లోని నీముచ్, మంద్సౌర్ ప్రాంతాలు ఓపియం (నల్లమందు)కు ప్రసిద్ధిగాంచాయి. అక్కడ ఈ మాదకద్రవ్యాన్ని స్మగ్లింగ్ చేసే ముఠాలన్నీ రాజస్థాన్ లోని సన్వారియాజీ దేవాలయాన్ని తరచు సందర్శిస్తుంటాయి. ఆలయంలో కొలువైనది శ్రీకృష్ణుడి అవతారమని స్థలపురాణం చెబుతోంది. అదలా ఉంచితే... ఈ అక్రమ రవాణాదారులు కొత్త అసైన్ మెంటు చేపట్టే ప్రతిసారి ఇక్కడికొచ్చి సన్వారియాజీ ఆశీస్సులు కోరతారు. అనంతరం, ఆ అసైన్ మెంటు ముగియగానే ఈ ఆలయానికి వచ్చి దేవుడికి తమ సంపాదనలో వాటా ఇస్తారు. అది నగదు రూపేణా కావచ్చు, లేక, నల్లమందు ప్యాకెట్ల రూపేణా కావచ్చు! మొత్తమ్మీద తమ అక్రమ దందాలో దేవుడినీ భాగస్వామిని చేస్తున్నారీ స్మగ్లర్లు. స్వామి చట్టం నుంచి తమను రక్షిస్తారన్నది ఈ స్మగ్లర్ల నమ్మిక. అందుకే, శక్తికొలదీ హుండీలో వేస్తుంటారు. దీంతో, ఈ ఆలయం కాస్తా ఆర్జన పరంగా రాజస్థాన్ లో రెండో స్థానంలో నిలిచింది. నెలకు సగటున రూ.2.5 కోట్ల మేర ఆదాయం వస్తోందని ఆలయ అధికారి రమేశ్ బహేరియా తెలిపారు.