: అందరి దృష్టి రాయుడిపైనే... నేడు హైదరాబాదులో మూడో వన్డే
భారత్, శ్రీలంక జట్ల మధ్య నేడు మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ కు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఐదు వన్డేల సిరీస్ లో టీమిండియా ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ లను నెగ్గి సిరీస్ లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. నేటి మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని కోహ్లీ అండ్ కో భావిస్తోంది. ఇక, రెండో వన్డేలో సెంచరీతో సత్తా చాటిన అంబటి తిరుపతిరాయుడు ఈ మ్యాచ్ లో ప్రధానాకర్షణగా నిలవనున్నాడు. రాయుడు సొంతగడ్డ హైదరాబాదు కావడంతో అందరి దృష్టి అతడిపైనే ఉండనుంది. అటు, శ్రీలంక జట్టు ఈ మ్యాచ్ లో నెగ్గి సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ లో ఓడితే సిరీస్ కోల్పోతుంది. అందుకే ఈ మ్యాచ్ లో విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డేందుకు సిద్ధమైంది.