: కారుణ్య నియామకానికి వివాహిత మహిళ కూడా అర్హురాలే!: మద్రాస్ హైకోర్టు
తండ్రి అనారోగ్యంతో చనిపోతే ఆయన చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగం విషయంలో కారుణ్య నియామకానికి పెళ్లయిన కుమార్తె ఎందుకు అర్హురాలు కాదు? వివాహమైన కుమారుడికి ఆ అర్హత ఉంది కదా? అని మద్రాస్ హైకోర్టు ఓ పిటిషన్ విషయంలో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. "వివాహితులైన కొడుకు, కుమార్తె మధ్య ఎలాంటి వివక్ష ఉండకూడదు. వివాహాన్ని సాకుగా చూపి కుమార్తె, కొడుకు మధ్య పక్షపాతం చూపడం అసమంజసం. ఈ విషయంలో సమానత్వ హక్కును అతిక్రమించకూడదు" అని జస్టిస్ డి.హరిపరంధామన్ గత వారం ఇచ్చిన ఓ తీర్పులో పేర్కొన్నారు. పశుగణాభివృద్ధి శాఖలో ఆఫీసు అసిస్టెంట్ గా పనిచేస్తున్న తన తండ్రి 1998 ఫిబ్రవరిలో మరణించారని, కాబట్టి ఆ ఉద్యోగం తనకు ఇవ్వాలంటూ పీఆర్ రేణుక అనే వివాహిత కోర్టులో పిటిషన్ వేసింది. భర్త వెళ్లగొట్టడం, విడాకులు తీసుకోవడంతో గత కొంతకాలంగా పుట్టింటిలోనే ఉంటున్న ఆమె, ఆ కుటుంబంలో పెద్ద కూతురు. తనతో పాటు పెళ్లయిన మరో ఇద్దరు చెల్లెళ్ళు, పెళ్లి కాని మరొక సోదరి కూడా ఉన్నారు. ఈ క్రమంలో కారుణ్య కోణంలో తండ్రి ఉద్యోగం కోరిన రేణుక అభ్యర్థనను, పెళ్లయిన మహిళలకు తండ్రి ఉద్యోగం ఇవ్వమంటూ ప్రభుత్వ అధికారులు 2002లో తిరస్కరించారు. పెళ్లికాని కొడుకు, కుమార్తె మాత్రమే తండ్రి చనిపోతే ఆ కారుణ్య నియామకానికి అర్హులని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆ నిర్ణయాన్ని ప్రశ్నించిన జస్టిస్ హరి పరంధామన్, తండ్రి చనిపోక ముందు నుంచే ఆమె వారితో నివసిస్తోందన్న విషయాన్ని ఎత్తి చూపారు. అందువలన ప్రభుత్వం ఆమె విజ్ఞప్తిని నిరాకరించకూడదని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో జూలై 2012లో హైకోర్టు తీర్పు ఆధారంగా... కొడుకు, కూతురు విషయంలో పెళ్లి అనేది అవరోధం కాకూడదని, అదే ప్రామాణికత కుమార్తె దరఖాస్తు చేసే విషయంలోనూ వర్తిస్తుందని తెలిపింది. ఎనిమిది వారాల్లోగా అధికారులు రేణుకను ఉద్యోగంలో తీసుకునేలా నియామకం ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.