: ఆదివారమే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ
మోదీ కేబినెట్ ఆదివారమే పునర్వ్యవస్థీకరణ కానుంది. సోమవారం కేబినెట్ విస్తరణ జరుగుతుందని గురువారం సాయంత్రం దాకా ఊహాగానాలు సాగినా, అందుకు భిన్నంగా ఒకరోజు ముందుగానే విస్తరణ కాకుండా పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముహూర్తం కూడా ఖరారైంది. గోవా సీఎం మనోహర్ పారికర్ సహా 10 మంది కొత్త వారు కేబినెట్ లో చేరనున్నారు. అదే సమయంలో ముగ్గురు నుంచి నలుగురు కేంద్ర మంత్రులకు ఉద్వాసన కూడా తప్పదన్న వార్తలు జోరందుకున్నాయి. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మహారాష్ట్రలో చిరకాల మిత్రపక్షం శివసేనకు రెండు బెర్తులను కేటాయించేందుకు మోదీ నిర్ణయించినట్టు సమాచారం. తద్వారా మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పదవిని డిమాండ్ చేయకుండా ఆ పార్టీకి కళ్లెం వేయాలని కూడా మోదీ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో బీజేపీ మిత్రపక్షం టీడీపీకి కూడా కేబినెట్ లో మరో బెర్తు లభించడం ఖాయంగానే కనిపిస్తోంది.