: జగన్ ను గజనీ మహ్మద్ తో పోల్చిన ఈడీ
గజనీ మహ్మద్.. తన కన్ను పడినది ఏదైనా తనకు దక్కాలనే స్వభావం కలవాడు. రాజ్యకాంక్షతో గజనీ భారత్ పై ఎన్నోసార్లు దండెత్తి దేశాన్ని కొల్లగొట్టాడు. అలాంటి వ్యక్తితో అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈడీ పోల్చింది. అతి తక్కువ కాలంలోనే జగన్ భారీగా ఆస్తులు కూడబెట్టడం అక్రమంగా ఉందని ఈడీ అభిప్రాయపడింది. నేడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు జగన్ కేసు విషయమై న్యాయ ప్రాధికార సంస్థలతో తమ వాదనలను బలంగా వినిపించారు.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డారని ఈడీ పేర్కొంది. అనుభవంలేని మీడియా రంగంలో జగతి పబ్లికేషన్స్ మూలధనం రూ. 1200 కోట్లు కాగా, నష్టం రూ.319 కోట్లు అని ఈడీ వెల్లడించింది. ఈ సంస్థలో పెట్టుబడులన్నీ క్విడ్ ప్రొ కో విధానంలోనే సమకూరాయని ఈడీ తెలిపింది. 36 సంస్థలు స్థాపించి ముడుపులను పెట్టుబడులుగా మార్చారని ఈడీ వివరించింది. ఈ క్రమంలో ఆస్తులు కూడబెట్టే విషయంలో జగన్ పర్షియన్ చక్రవర్తి గజనీ మహ్మద్ లా మొండిగా వ్యవహరించారని వ్యాఖ్యానించింది.