: చెక్ సంబంధిత మోసాల నివారణకు ఆర్ బీఐ కొత్త నిబంధన
దేశంలో చెక్ సంబంధిత మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకనుంచి రూ.2 లక్షలకు మించి జారీ చేసిన చెక్ లు క్లియరింగ్ కు వచ్చినప్పుడు సంబంధిత ఖాతాదారులకు ఫోన్ కాల్ చేయడంతో పాటు, మొబైల్ కు ఎస్ఎంఎస్ పంపి, అప్రమత్తం చేయాలని బ్యాంకులను ఆర్ బీఐ ఆదేశించింది. అదే, ఇతర శాఖలకు సంబంధించిన చెక్ లు అయితే, సంబంధిత బ్యాంకు శాఖలను సంప్రదించాలని సూచించింది. చెక్ జారీ చేసిన ఖాతాదారులు, అందుకునే వ్యక్తుల మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ పంపి వారిని అప్రమత్తం చేయడంతో పాటు, అసలైన చెక్ ఇచ్చారా? లేదా? అనేది తెలుసుకునేందుకు అల్ట్రా వయొలెట్ లైటు కింద ఉంచి పరిశీలించాలని కోరింది. ఇక, రూ.5 లక్షలకు మించిన చెక్ లను క్లియర్ చేసే క్రమంలో, అనేక విడతలుగా పరిశీలన చేయాలని స్పష్టం చేసింది. నకిలీ చెక్ ద్వారా నగదు డ్రా చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలోనే ఆర్ బీఐ ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది.