: గోవా సీఎం రేసులో ఆర్ఎస్ఎస్ నేతలు
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఇపుడు ఆ రాష్ట్ర కొత్త సీఎం ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో, గోవా బీజేపీ యూనిట్ ఈ రోజు సమావేశమై సీఎం పదవికి పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మీకాంత్ పరాస్కర్, శాసనసభ స్పీకర్ రాజేంద్ర అర్లకర్ లను సీఎం పదవికి పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న ఈ ఇద్దరూ గతంలో గోవా బీజేపీకి అధ్యక్షులుగా పనిచేశారు. ఈ క్రమంలో, ఇద్దరిలో ఎవరు గోవా నూతన సీఎం అవుతారన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా నియమితులవుతారని భావిస్తున్న పారికర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన ముందుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలవనున్నారు. ఈ రాత్రికి ప్రధానిని కలసి చర్చిస్తారు.