: భారత మహిళా బాక్సర్లకు గర్భ నిర్ధారణ పరీక్షలు


భారత్ తరపున ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో పాల్గొనబోతున్న మహిళా బాక్సర్లకు గర్భ నిర్ధారణ పరీక్షలు జరిపి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) పెను వివాదానికి తెరలేపింది. ఈ తరహా చర్యలతో... క్రీడల పట్ల ఆసక్తి చూపే మహిళలు కూడా తటపటాయించే విపత్కర పరిస్థితులు నెలకొనే ప్రమాదం తలెత్తుతుందని క్రీడా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో దేశం తరపున పాల్గొనేందుకు ఎనిమిది మంది మహిళా బాక్సర్లు సన్నద్ధమవుతున్నారు. వీరికి గర్భ నిర్ధారణ పరీక్షలు చేయాలని బాక్సింగ్ ఇండియా సాయ్ ను కోరిందట. ఇంకేముంది... సాయ్ తన వైద్యులతో మహిళా బాక్సర్లకు సదరు పరీక్షలు నిర్వహించింది. పోటీల్లో పాల్గొనాలనే దృఢ సంకల్పంతో ఉన్న సదరు మహిళా బాక్సర్లు కష్టమనిపించినా, నోరెత్తకుండా పరీక్షలకు హాజరయ్యారని సాయ్ వైద్య సలహాదారు సీఎస్ఎం చంద్రన్ వెల్లడించారు. అసలు అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ గర్భ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఎక్కడా చెప్పలేదని కూడా చంద్రన్ పేర్కొన్నారు. సాధారణ వైద్య పరీక్షలు చేయించుకుని నో ప్రెగ్నెన్సీ సర్టిఫికెట్ ను క్రీడాకారులు సొంత డిక్లరేషన్ తో సమర్పిస్తే సరిపోతుంది. అదే, 18 ఏళ్ల లోపు బాలికలైతే వారి తల్లిదండ్రులు డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. ఈ వెసులుబాటును మరుగున పెట్టేసి సాయ్ పరీక్షలు నిర్వహించడంపై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షలకు హాజరైన వారిలో వివాహితులతో పాటు అవివాహిత యువతులు, మైనర్ బాలికలు ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News