: నకిలీ యూనివర్సిటీ వ్యవస్థాపకురాలికి 16 ఏళ్ల జైలు శిక్ష
వందలాది మంది భారతీయ విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన కాలిఫోర్నియా ట్రైవ్యాలీ యూనివర్సిటీ వ్యవస్థాపకురాలు సూసన్ జియావో పింగ్ సు (44)కు అమెరికా న్యాయస్థానం 16 ఏళ్లకు పైగా శిక్ష విధించింది. నకిలీ విశ్వవిద్యాలయం స్థాపించడమే కాకుండా, ఇమ్మిగ్రేషన్ కుంభకోణానికి పాల్పడ్డట్టు న్యాయస్థానం నిర్ధారించింది. యూనివర్సిటీని ఆధారం చేసుకుని చేసిన కుంభకోణంలో సుమారు 5.9 మిలియన్ డాలర్లను వెనకేసుకున్నట్టు న్యాయస్థానం తేల్చింది. ఆమె ఈ సొమ్ముతో వాణిజ్యసముదాయాలు, విలాసవంతమైన కారు, భవంతులు కొన్నారని ప్రాసిక్యూషన్ పేర్కొంది. సూసాన్ షియో పింగ్ సు కు చెందిన ఆస్తులను జప్తు చేయాలని, బాధితులకు 9 లక్షల డాలర్లకు పైగా పరిహారం చెల్లించాలని లాస్ ఏంజిలెస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి జాన్ ఎస్ టిగర్ ఆదేశించారు. కాగా, 2010లో భారతీయ విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఆమె దురాగతం వెలుగు చూసింది.