: నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం... తొలిరోజే బడ్జెట్!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడంతో మొదలు కావడం విశేషం. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, మండలిలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందు నేటి ఉదయం 10 గంటలకు సమావేశం కానున్న తెలంగాణ కేబినెట్ రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదముద్ర వేస్తుంది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావడంతో తెలంగాణ ప్రాధాన్యాలను ప్రతిబింబించేలా బడ్జెట్ ను రూపొందిస్తున్నామని నిన్నటిదాకా చెబుతూ వస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు నేడు బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. బడ్జెట్ లో వడ్డింపుల కంటే సంక్షేమానికే పెద్ద పీట వేయనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. మరి బడ్జెట్ ఎలా ఉండబోతోందన్న అంశంపై నెలకొన్న ఉత్సుకత నేటి మధ్యాహ్నంలోగా తొలగిపోనుంది.