: అడ్డగోలు సంపాదన ఏం చేయాలో తెలీకే జగన్ దీక్షలు: సోమిరెడ్డి
ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపటినుంచి దీక్ష చేపట్టనుండడంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. హైదరాబాదులోని టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన మాట్లాడుతూ, అడ్డగోలుగా సంపాదించిన డబ్బును ఏం చేయాలో తెలీకే ఇలా దీక్షలు చేపడుతున్నారని విమర్శించారు. మూడు నెలలపాటు దీక్షలు అని జగన్ అంటున్నారని, ఈ మూడు నెలల్లో ఆయన జైలుకు వెళ్లరన్న నమ్మకం ఉందా? అని చురక వేశారు. జగన్ ఆరోపణలు అర్థరహితమన్నారు. కాంగ్రెస్ పాలనలో వేల కోట్ల రూపాయల ఎర్రచందనం అక్రమరవాణా జరిగిందని, వాటిపై ఎందుకు ప్రశ్నించలేదన్నారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ నాశనం చేసిందన్నారు. రాష్ట్రం కష్టాల్లో ఉందని, అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గాడినపెడుతున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ కొరత నెలకొని ఉన్న సమయంలోనూ గృహావసరాలకు, వ్యవసాయానికి ఎనిమిది తొమ్మిది గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తుంటే, దీనిపైనా రాద్ధాంతం చేయడం తగదని జగన్ కు హితవు పలికారు. రాష్ట్రంలో బరితెగించిన ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేస్తూ, డ్వాక్రా మహిళలకు ఆదాయం వచ్చే మార్గాలు చూపడాన్ని సైతం జగన్ వ్యతిరేకిస్తున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. బకింగ్ హాం కెనాల్ పునరుద్ధరణకు కేంద్రం ఆమోదం తెలిపిందని, ఇది కూడా మీకిష్టం లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పుడు పవర్ హాలీడే లేదని, క్రాప్ హాలీడే లేదని, రూ.5000 కోట్లతో రైతు సాధికారత కార్పొరేషన్ ను ఏర్పాటు చేశామని సోమిరెడ్డి వివరించారు. తుపానుతో అతలాకుతలమైన విశాఖకు పూర్వపు రూపురేఖలు తెచ్చేందుకు బాబు విపరీతంగా కష్టపడుతున్నారని, ఇందులో ఏం తప్పుబడతారని నిలదీశారు. తుపాను వేళ చంద్రబాబు విశాఖలో ఉన్నారని, అదే సమయంలో జగన్ '7 స్టార్' హోటల్లో ఉన్నారని విమర్శించారు. హోండా కంపెనీని రాష్ట్రానికి తీసుకువచ్చింది చంద్రబాబు కాదా? విశాఖను స్మార్ట్ సిటీగా ప్రకటన చేయించింది చంద్రబాబు కాదా? అని సూటిగా అడిగారు.