: జనవరిలో నిరాహార దీక్ష చేపడుతున్నా: జగన్


ఆరు నెలల నుంచి అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్క ఎన్నికల హామీని కూడా నెరవేర్చలేక పోయారని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు. అన్ని విషయాలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే ఎన్నికల హామీలను ఇస్తున్నామన్న చంద్రబాబు...ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని... ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు రూ. 2 వేల భత్యం చెల్లిస్తామన్న చంద్రబాబు ఆ హామీని గాలికొదిలేశారని విమర్శించారు. రైతు రుణాలు మాఫీ కాకపోవడం వల్ల, రైతులపై మరో రూ. 14 వేల కోట్ల అపరాధ భారం పడిందని చెప్పారు. రుణాలను రీషెడ్యూల్ చేయకపోవడం వల్ల పంటలకు ఇన్స్యూరెన్స్ సదుపాయం లేకుండా పోయిందని జగన్ మండిపడ్డారు. డ్వాక్రా మహిళలను నిర్దాక్షిణ్యంగా పోలీసులతో నెట్టి వేస్తున్నారని అన్నారు. చంద్రబాబును గట్టిగా నిలదీయాల్సిన సమయం ఆసన్నమయిందని తెలిపారు. రేపట్నుంచి అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. డిసెంబరులో కలెక్టరేట్లలో నిరసన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని... ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. జనవరి 6, 7 తేదీల్లో స్వయంగా తానే నిరాహార దీక్షకు కూర్చుంటున్నట్టు తెలిపారు. గోదావరి జిల్లాల్లో తన నిరాహారదీక్ష ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News