: శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులకు తగ్గితే సీమకు కష్టాలే: దేవినేని ఉమ
శ్రీశైలం రిజర్వాయర్ లో నీటి మట్టం 854 అడుగుల కంటే కిందకు తగ్గితే రాయలసీమకు కష్టాలు మొదలవడం ఖాయమని ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు. నీటి మట్టం 854 అడుగులకు తగ్గిపోతే సాగు నీటితో పాటు, తాగు నీటికీ కొరత ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతిని ఆయన కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విద్యుదుత్పత్తి నీటి వాడకంపై కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ సర్కారు తుంగలో తొక్కిందని ఉమ ఆరోపించారు. బోర్డు నిష్పక్షపాతంగా వ్యవహరించిందన్నారు. అయితే తెలంగాణ సర్కారు ఏకపక్ష వైఖరి వల్లే వివాదం నెలకొందన్నారు. బోర్డు ఆదేశాలను ఉల్లంఘించిన తెలంగాణ మంగళవారం కూడా విద్యుదుత్పత్తి చేపట్టిందన్నారు. ఈ విషయాలన్నింటినీ బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని ఉమాభారతి సూచించారన్నారు. తెలంగాణ మంత్రిని కూడా బోర్డు వద్దకే వెళ్లమని చెప్పినట్లు ఆమె తెలిపారన్నారు.