: ప్రాక్టికల్స్ పాసవ్వాలంటే రక్తమివ్వాల్సిందే... విద్యార్థులకు ప్రిన్సిపాల్ హుకుం


ఛత్తీస్ గఢ్ లోని బల్ రామ్ పూర్ జిల్లాలో ఓ కళాశాల ప్రిన్సిపాల్ విచిత్రమైన రూల్స్ పెట్టాడు. ప్రాక్టికల్ పరీక్షల్లో పాసవ్వాలంటే రక్తదానం చెయ్యాల్సిందేనంటూ తన విద్యార్థులకు హుకుం జారీచేశాడు. దీంతో, బెదిరిపోయిన విద్యార్థులు రక్తదానం చేశారు. ఆ రక్తాన్ని ఓ ప్రైవేటు బ్లడ్ బ్యాంకుకు విక్రయించినట్టు సదరు ప్రిన్సిపాల్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. వివరాల్లోకెళితే... రాజ్ పూర్ డిగ్రీ కళాశాలకు డాక్టర్ బీకే గార్గ్ ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నాడు. రక్తదానం చేయాలని, అలా చేస్తే బ్లడ్ బ్యాంకులు, ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇస్తాయని ప్రలోభపెట్టాడు. కొందరు విద్యార్థులు అందుకు అంగీకరించగా, మరికొందరు వ్యతిరేకించారు. దీంతో, తన మాట వినని విద్యార్థులను ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరించాడు. గతంలో తన మాట లక్ష్యపెట్టని కొందరు విద్యార్థులను ఇలాగే ఫెయిల్ చేశానంటూ వారిని హెచ్చరించాడు. తాను నిర్వహించే రక్తదాన శిబిరానికి జిల్లాస్థాయి అధికారులు వస్తారని తెలిపినా, ఒక్క అధికారి కూడా హాజరుకాలేదు. అటు, రక్తమిచ్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లూ ఇవ్వలేదు. దీనిపై జిల్లా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ కు సమాచారం అందించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో, ప్రిన్సిపల్ గార్గ్ పరారయ్యాడు. దీనిపై దర్యాప్తు జరుపుతున్న సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ భూపేంద్ర అగర్వాల్ మాట్లాడుతూ, అనుమతి లేకుండా ప్రైవేటు బ్లడ్ బ్యాంకుతో కలసి రక్తదాన శిబిరం నిర్వహించడంపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. రక్తదాన శిబిరం నిర్వహించాలంటే జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి అని చెప్పారు.

  • Loading...

More Telugu News