: ఈ నెల 12న మహారాష్ట్ర సీఎం బలపరీక్ష!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నెల 12న తన బలాన్ని నిరూపించుకోనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బలపరీక్షను ఎదుర్కొనేందుకు ఫడ్నవీస్ దాదాపుగా సిద్ధమయ్యారని మహారాష్ట్ర సీఎంఓ వర్గాలు తెలిపాయి. ఇటీవల రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగిన బీజేపీ ఫలితాల అనంతరం ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను దక్కించుకోలేకపోయింది. దీంతో అటు శివసేన కాని, ఇటు ఎన్సీపీ కాని మద్దతిస్తే కాని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. బయటి నుంచి మద్దతిచ్చేందుకు ఎన్సీపీ చేసిన ఓపెన్ ఆపర్ ను బీజేపీ పట్టించుకోలేదు. తాజాగా శివసేనతో పొత్తు ఖాయమని సాక్షాత్తు ఫడ్నవీస్ చెప్పారు. అయితే పొత్తు విషయంలో సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఎటొచ్చి ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ముప్పు లేదు. దీంతో ఈ నెల 12న బల పరీక్షను ఎదుర్కొనేందుకే ఫడ్నవీస్ మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం సభను మూడు రోజుల పాటు సమావేశపరిచేందుకు కసరత్తు జరుగుతోంది.