: కోచిలో 'కిస్ ఆఫ్ లవ్'ను అడ్డుకున్న పోలీసులు
కోచిలో భజరంగ్ దళ్ కి వ్యతిరేకంగా చేపట్టతలపెట్టిన 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎర్నాకుళం లా కళాశాల నుంచి మెరైన్ డ్రైవ్ గ్రౌండ్స్ కు 'కిస్ ఆఫ్ లవ్' నిర్వాహకులు, సానుభూతి పరులు ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 50 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. 'కిస్ ఆఫ్ లవ్' మద్దతుదారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ 'నైతిక పోలీసింగ్'కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెరైన్ డ్రైవ్ గ్రౌండ్స్ లో 'కిస్ ఆఫ్ లవ్' నిర్వహించనున్నారని మీడియాలో ప్రసారం కావడంతో ఏం జరుగుతుందో చూద్దామని పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నారు. 'చుంబన పండుగ'ను వ్యతిరేకిస్తూ శివసేన, ముస్లిం సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో పోలీసులను భారీగా మోహరించారు. వెయ్యి మంది ఇందులో పాలుపంచుకుంటారని నిర్వాహకులు ప్రకటించగా, చివరి నిమిషంలో వ్యూహం మార్చుకుని ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.