: చంద్రబాబు బండారం బయటపెట్టేందుకు విజయవాడలోనే సభ పెడతాం: కేసీఆర్
చంద్రబాబు బండారం బయటపెట్టేందుకు విజయవాడలో సభ పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఆదివారం మల్కాజిగిరిలో తాగునీటి పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా కేసీఆర్ మరోమారు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ముందుచూపు లేదని తమపై బాబు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేసిన కేసీఆర్, తమకు చంద్రబాబులాగా దొంగచూపు లేదన్నారు. రైతుల రుణ మాఫీ విషయంలో చంద్రబాబు తప్పుడు వాగ్దానాలు ఇచ్చారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే బెల్టు షాపులను రద్దు చేస్తామని ఎన్నికల నాడు హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారం చేపట్టిన తర్వాత బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు బండారాన్ని బయటపెట్టడంతో పాటు ఆంధ్రా ప్రాంత రైతుల పక్షాన పోరు సాగించేందుకు అవసరమైతే విజయవాడలో సభ పెడతామని ప్రకటించారు. ఆ సభలో అవసరమైతే తానే స్వయంగా పాల్గొంటానని కేసీఆర్ ప్రకటించారు.