: శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని నిలిపేయాలి: రాయలసీమ విద్యార్థి సమాఖ్య డిమాండ్
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విద్యుదుత్పత్తిని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ విద్యార్థి సమాఖ్య ఆదివారం ధర్నాకు దిగింది. ప్రాజెక్టులోని ఎడమ గట్టు కాలువ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. నిర్ణీత నీటి మట్టం వరకే విద్యుదుత్పత్తిని చేపట్టాలని నిబంధనలు చెబుతున్నాయని ఈ సందర్భంగా విద్యార్థులు వాదిస్తున్నారు. తెలంగాణ అనాలోచిత నిర్ణయాలతో రాయలసీమలో సాగునీటికే కాక తాగు నీటికి కూడా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం పొంచి ఉందని విద్యార్థులు చెబుతున్నారు. తక్షణమే విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుదుత్పత్తిని నిలిపివేసేదాకా వెనుదిరిగే ప్రసక్తి లేదని విద్యార్థులు తెగేసి చెప్పారు.