: విదేశాల్లోని నల్లధనంలోని ప్రతి పైసానూ రప్పిస్తాం: 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తన రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లో భాగంగా ఆదివారం నల్లధనం అంశాన్ని ప్రస్తావించారు. ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రేడియో ప్రసంగంలో తొలుత స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడిన ప్రధాని, తమ చర్యతో ప్రస్తుతం ప్రతి వ్యక్తి సమాజం గురించి ఆలోచించే దిశగా పయనిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం సైనికుల ధైర్య సాహసాలను కొనియాడిన మోదీ, దీపావళి సందర్భంగా వారితో గడిపిన సందర్భాన్ని నెమరువేసుకున్నారు. నల్లధనంపై మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఈ విషయంలో సరైన దిశగానే పయనిస్తోందన్నారు. నల్లధనాన్ని దేశానికి రప్పించడంలో ఏమాత్రం రాజీ పడబోమని మోదీ స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలపై తనకో లేఖ వచ్చిందన్న మోదీ, దానిపై వచ్చే నెలలో నిర్వహించే కార్యక్రమంలో మాట్లాడుకుందామని తెలిపారు. నల్లధనం విషయంలో ప్రజల సలహాలు, సూచనలు కోరుతున్నట్లు మోదీ ప్రకటించారు.