: సంస్కరణల బడ్జెట్ కు సలహాలివ్వండి: అధికారులకు మోదీ పిలుపు
రానున్న బడ్జెట్ ను పూర్తి స్థాయిలో సంస్కరణల దిశగా రూపొందించనున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సదరు బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి సలహాలు, సూచనలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వ అధికారులకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన పనిలేదని, నిరభ్యంతరంగా అభిప్రాయాలు వెల్లడించాలని సూచించారు. శనివారం సాయంత్రం తన అధికారిక నివాసంలో మోదీ ఏర్పాటు చేసిన తేనీటి విందుకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న దాదాపు 80 మంది కార్యదర్శి స్థాయి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులతో ఉల్లాసంగా గడిపిన మోదీ, తదనంతరం తమ ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు, అధికారుల పాత్ర తదితరాలపై మాట్లాడారు. ఇందులో భాగంగా బడ్జెట్ పై సలహాలను ఆయన వారి నుంచి కోరారు.