: విలేకరిపై సోనియా గాంధీ అల్లుడు చిందులు!


హర్యానాలో తనపై వెల్లువెత్తిన ఆరోపణలకు సంబంధించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నలకు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఆగ్రహోదగ్రుడయ్యారు. న్యూఢిల్లీలోని అశోకా హోటల్ లో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. తనపై ప్రశ్నలు సంధించిన విలేకరిపై వాద్రా దురుసుగా ప్రవర్తించడమే కాక మైకును లాగి పడేశారు. హర్యానాలో గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం, వాద్రా భూముల కేటాయింపులను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ఓ విలేకరి వాద్రా స్పందనను కోరారు. అయితే అప్పటిదాకా బాగానే ఉన్న వాద్రా, ఆ ప్రశ్నతో ఒక్కసారిగా అంతెత్తున ఎగిరిపడ్డారు. ‘సీరియస్ గానే ఆ ప్రశ్న అడుగుతున్నావా?’ అంటూ విలేకరిని బెదిరిస్తున్న చందంగా ఎదురు ప్రశ్నించారు. ‘ముందు నీ కెమెరాను బంద్ చెయ్యి’ అంటూ మైక్రోఫోన్ ను వాద్రా పక్కకు నెట్టేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో ఫుటేజీలు శనివారం రాత్రి నెట్ లో హల్ చల్ చేశాయి. అయితే, ఏ ఒక్క కాంగ్రెస్ నేత కూడా వాద్రాకు అనుకూలంగా మాట్లాడేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News