: మేం అధికారంలోకి వస్తే నవంబర్ ఒకటినే రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహిస్తాం: జగన్
జూన్ 2న ఏపీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడంపై వైకాపా అధినేత జగన్ మండిపడ్డారు. తెలంగాణ మాత్రమే కొత్తగా ఏర్పడిందని... ఏపీ పాత రాష్ట్రమే అయినందువల్ల అవతరణ దినోత్సవ తేదీని మార్చరాదని ప్రభుత్వానికి సూచించారు. తాము అధికారంలోకి వస్తే నవంబర్ 1నే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గతంలో రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా అవతరణ దినోత్సవాలను ఎవరూ మార్చుకోలేదని అన్నారు. చరిత్రను చంద్రబాబు విస్మరిస్తున్నారని విమర్శించారు. నవంబర్ 1నే అవతరణ దినోత్సవం జరుపుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. వైకాపా కార్యాలయంలో ఈ రోజు ఏపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జగన్ నిర్వహించారు.