: ఫ్యాన్స్ ను చూసే పదవి ఇచ్చారంటోన్న చిరంజీవి
కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులపై ప్రశంసల జల్లు కురిపించారు. తన వెనుక ఉన్న లక్షలాది మంది ఫ్యాన్స్ ను చూసే తనకు కాంగ్రెస్ అధిష్ఠానం పదవులిచ్చిందని చిరంజీవి ఉద్వేగపూరితంగా వ్యాఖ్యానించారు. అల్లు అరవింద్ చిన్న కుమారుడైన శిరీష్ నటించిన 'గౌరవం' చిత్రం ఈ నెల 19న శ్రీరామనవమి నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నేడు హైదరాబాద్ లో జరిగిన అల్లు శిరీష్ పరిచయ కార్యక్రమంలో చిరు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన అభిమాన సందోహాన్ని ఉద్ధేశించి చిరంజీవి మాట్లాడుతూ, 30 ఏళ్ళుగా తనను గుండెల్లో పెట్టుకుని ఆదరించడమే కాకుండా, తన కుటుంబం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లను సైతం ప్రోత్సహిస్తున్నారంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
తాను ఈరోజు ఢిల్లీ వెళ్ళాల్సి ఉన్నా, ఫ్యాన్స్ ను కలిసే కార్యక్రమం ఉందని శిరీష్ చెప్పడంతో మరేమీ ఆలోచించకుండా రాజకీయ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని ఇక్కడికి వచ్చానని చిరు వెల్లడించారు. రాజకీయపరంగా, మంత్రి పదవితో సహా ఏ హోదా అయినా, తనకు దక్కినవన్నీ అభిమానుల మూలంగానే అని చిరంజీవి పేర్కొన్నారు. ఫ్యాన్స్ ఎప్పటికీ తమ కుటుంబంలో భాగమేనంటూ చిరంజీవి కార్యక్రమానికి హాజరైన వారిలో సంతోషాన్ని నింపారు.