: కేబినెట్ సమావేశంలో గంటా శ్రీనివాసరావు కు చంద్రబాబు క్లాస్


గురువారం జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతలకు చంద్రబాబు సీరియస్ క్లాస్ తీసుకున్నారు. తమకు కేటాయించిన శాఖలకు సంబంధించిన విషయాలపై ఎందుకు అవగాహన పెంచుకోవడం లేదని చంద్రబాబు ఈ ముగ్గురిని ప్రశ్నించారు. ముఖ్యంగా, గంటా శ్రీనివాసరావును ఈ సమావేశంలో చంద్రబాబు కాస్త తీవ్రంగానే మందలించారు. ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల (ఏపీ, తెలంగాణ) విద్యామంత్రుల సమావేశం గురించి కేబినెట్ మీట్ లో చంద్రబాబు ఆరా తీశారు. ఈ సమావేశంలో, తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి తన వాదనను బలంగా వినిపిస్తే, దానికి దీటుగా ఎందుకు సమాధానం చెప్పలేకపోయారని ఆయన గంటాను ప్రశ్నించారు. ''మీ మీద ఎంతో నమ్మకంతో కీలకమైన శాఖను అప్పచెబితే, ఇంత బాధ్యతారాహిత్యమా? సబ్జెక్ట్ పై అవగాహన లేనప్పుడు మంత్రుల సమావేశానికి ఎందుకు చొరవ తీసుకున్నారు? ప్రతీదానికి ముఖ్యమంత్రిని అడిగి చెప్తా అనడానికి మీరేమైనా పరమానందయ్య శిష్యులా?'' అంటూ చంద్రబాబు గంటాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చిన్నపిల్లాడిలా ప్రతి చిన్న విషయానికి ముఖ్యమంత్రితో మాట్లాడి చెబుతాననే దాటవేత ధోరణిని మానుకోవాలని చంద్రబాబు ఆయనను హెచ్చరించారు.

  • Loading...

More Telugu News