: సమస్య వచ్చినప్పుడు కేసీఆర్ కేంద్ర మంత్రులెవరితోను మాట్లాడటం లేదు: వెంకయ్య


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని ఏ విషయంలోను సంప్రదించడం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. నిన్న టీటీడీపీ నేతలు తనను కలిసిన అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయంలోనైనా సహాయం కోరితే కేంద్రం కచ్చితంగా స్పందిస్తుందని ఆయన అన్నారు. కానీ, ఇప్పటి వరకూ కేసీఆర్ కేంద్ర మంత్రులెవరితోను మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ఏది అడిగినా, కేంద్రం నిరాకరించలేదన్నారు. కానీ, కీలకమైన అంశాలు, సమస్యలపై టీఎస్ సర్కార్ కేంద్రంతో సంప్రదింపులు జరపటం లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విపక్షాలు.. కేంద్రం వద్దకు వచ్చి ప్రజల సమస్యలు చెబుతున్నప్పటికీ, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు సంప్రదించలేదో మీడియానే ప్రశ్నించాలని ఆయన సూచించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ ప్రాంతం త్వరగా అభివృద్ధి చెందుతుందని, తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువ లభిస్తాయని తెలంగాణ ప్రజలు ఆశించారని... వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు కేంద్రం కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే, తెలంగాణ ప్రాంత సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకురావాలని అన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, వివాదాలను కాదని చెప్పారు. తమ దృష్టిలో తెలంగాణ, ఏపీ రెండూ సమానమేనని, రెండింటి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలసి పనిచేసేందుకు ముందుకు వస్తే బాగుంటుందన్నారు.

  • Loading...

More Telugu News