: నల్లధనాన్ని కాదు కదా, కనీసం ఓ కుందేలును కూడా తీసుకురాలేరు: జేడీయూ చీఫ్
స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తిరిగి తీసుకువస్తామన్న కేంద్రం ఆ పని ఎన్నటికీ చేయలేదంటున్నారు జనతాదళ్ యునైటెడ్ పార్టీ అధినేత శరద్ యాదవ్. ఢిల్లీ నుంచి పాట్నా చేరుకున్న ఆయన విమానాశ్రయంలో మాట్లాడుతూ, బ్లాక్ మనీని భారత్ తీసుకురావడం తమ స్వప్నమని నరేంద్ర మోదీ సర్కారు చెప్పుకుంటోందని, కనీసం ఓ కుందేలును కూడా బయటి నుంచి దేశంలోకి తీసుకురాలేరని వ్యాఖ్యానించారు. 627 మందితో కూడిన నల్లకుబేరుల జాబితాను కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన నేపథ్యంలో, అర్థంలేని చర్చ నడుస్తోందని అన్నారు. నల్లధనం దేశంలోకి వచ్చే అవకాశమే లేదని తాను భావిస్తున్నానని శరద్ యాదవ్ తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆకాశం నుంచి నక్షత్రాలను భువికి దింపుతామని బీజేపీ నేతలు ప్రగల్భాలు పలికారని, అయితే, అది ఎప్పుడు? ఎలా? అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదన్నారు.