: పాత మిత్రులకు డీఎంకే స్నేహహస్తం... మెగా అలయెన్స్ కు ప్రయత్నాలు
తమిళనాట గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన డీఎంకే... మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసు, జైలు శిక్షను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పాత మిత్రులను బుజ్జగించి, 2016 ఎన్నికల నాటికి మెగా కూటమిని ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఆస్తుల కేసులో ఇటీవల శిక్షపడిన నేపథ్యంలో జయ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హురాలు. ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకుని తిరిగి తమిళనాడులో బలీయమైన రాజకీయ శక్తిగా ఎదగాలని ఇప్పటినుంచే డీఎంకే పావులు కదుపుతున్నట్లు తాజా సమాచారం. ఈ ఆలోచనతోనే పాత మిత్రులైన పీఎంకే, ఎండీఎంకేలను తిరిగి దగ్గర చేర్చుకోవాలనుకుంటోందట. మంగళవారం సాయంత్రం పీఎంకే నేత అన్బుమణి రామదాస్ చెన్నైలో తన కూతురి వివాహ విందు ఏర్పాటు చేశారు. దానికి డీఎంకే నేత, కరుణానిధి కుమారుడు స్టాలిన్ హాజరయ్యారు. అక్కడికి వచ్చిన ఎండీఎంకే అధినేత వైగోను చిరునవ్వుతో పలకరించి, కరుణ కరచాలనం కూడా చేశారు. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత కరుణ మాట్లాడుతూ, "వైగో నా శత్రువు కాదు. నాకు స్నేహితుడు. కొత్త సంకీర్ణం ఏర్పడితే సంతోషిస్తాను" అన్నారు. అటు స్టాలిన్ తో సమావేశం అనంతరం వైగో మాట్లాడుతూ, ఇరు కుటుంబాల యోగక్షేమాల గురించి మాట్లాడుకున్నామని చెప్పారు. ఈ పరిణామాల రీత్యా పాతమిత్రులు మళ్లీ ఒక్కటయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.