: 'ఫైర్' సిబ్బంది పాములు పట్టడం నేర్చుకుంటున్నారు!
తమిళనాడులోని అగ్నిమాపక దళ సిబ్బందికి కొత్త శిక్షణ ఇస్తున్నారు. అదేంటంటే, జనావాసాల్లో ప్రవేశించిన పాములను ఎలా పట్టుకోవాలి? వాటిని గాయపర్చకుండా వ్యవహరించడం ఎలా? వాటి కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి? వంటి అంశాల్లో ఊటీకి చెందిన 'వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ కన్జర్వేషన్ ట్రస్ట్' అనే స్వచ్ఛంద సేవా సంస్థ తిరుచిరాపల్లిలోని అగ్నిమాపక దళ సిబ్బందికి తర్ఫీదునిస్తోంది. ఫైర్ ఫైటర్లతో పాటు అటవీశాఖ సిబ్బంది కూడా ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. బుధవారం జరిగిన శిక్షణ కార్యక్రమం సందర్భంగా కన్జర్వేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సాదిక్ అలీ మాట్లాడుతూ, తగిన పరికరాలు లేకుండా పాములు పట్టుకునేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. పామును పట్టుకునే సమయంలో ప్రత్యేక హుక్, రెస్క్యూ బ్యాగ్ ఉండాలని సూచించారు. జనావాసాల్లో పాములు కనిపిస్తే వెంటనే చంపేస్తున్నారని, వాటిని కాపాడడం కోసమే ఈ శిక్షణ కార్యక్రమం చేపట్టామని అలీ వివరించారు. వైల్డ్ లైఫ్ చట్టం ప్రకారం పాములను చంపడం నేరమని అన్నారు. దేశంలో 300 సర్ప జాతులు ఉండగా, వాటిలో 8-10 శాతం మాత్రమే విషపూరితం. త్రాచు పాము, కట్ల పాము, గుమ్మడి విత్తుల పింజర, రక్త పింజర పాములే భారత్ లో అత్యధికంగా మరణాలకు కారణమవుతున్నాయి.